వైఎస్సార్ పింఛను కానుక మంజూరులో కీలక మార్పు
వైఎస్సార్ పింఛను కానుక మంజూరులో కీలక మార్పు
శాఖల ధ్రువీకరణతోనే పింఛను
వైఎస్సార్ పింఛను కానుక పథకం కింద సామాజిక భద్రత పింఛను మంజూరు ప్రక్రియలో ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి పింఛను మంజూరయ్యేందుకు ఇకపై ఆయా శాఖలు జారీ చేసిన ధ్రువపత్రాన్ని తప్పనిసరిగా సమర్పించాలి.
ఈ మేరకు 21 రోజుల పింఛను మంజూరు ప్రక్రియలో మార్పు చేస్తూ తాజాగా ప్రామాణిక నిర్వహణ విధానాన్ని (ఎఓపీ) ప్రభుత్వం విడుదల చేసింది.
ఇప్పటివరకు దరఖాస్తుదారులు ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నట్లు గుర్తింపుకార్డులు, కొన్ని పింఛన్లకు స్వీయ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పిస్తే స్థానిక సచివాలయ అధికారుల క్షేత్రస్థాయి పరిశీలన అనంతరం పింఛను మంజూరు చేస్తున్నారు.
ఈ విధానంలో అనర్హులు లబ్ధి పొందుతున్నట్లు రాష్ట్రస్థాయి అధికారులు గుర్తించారు.
దీంతో పింఛను మంజూరు ప్రక్రియలో మార్పులు చేశారు.
తాజాగా పింఛను కోసం దరఖాస్తు చేసుకున్నవారు ఆయా వృత్తుల్లో కొనసాగుతున్నట్లు ఆయా శాఖల జిల్లా అధికారులు ధ్రువీకరించాల్సి ఉంటుంది.
ఈ పత్రాన్ని డిజిటల్ విధానంలో జారీ చేసేలా మార్పులు తేనున్నారు.
- ఒంటరి మహిళలకు సంబంధించిన పింఛను అర్హత తేల్చే బాధ్యతలను స్థానిక రెవెన్యూ అధికారికి అప్పగించారు.
- దరఖాస్తుదారు ఒంటరిగానే జీవిస్తున్నట్లు రెవెన్యూ అధికారి ధ్రువపత్రాన్ని అందించాలి.
- వితంతువు భర్త చనిపోయినట్లు మరణ ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాలి.
- హిజ్రాలు జిల్లా వైద్యమండలి జారీ చేసిన ధ్రువపత్రాన్ని ఇవ్వాలి.
Source :- Eenadu Paper